ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రాజమండ్రి నియోజకవర్గం

రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న నగరం. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువల్ల ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు. రాజమహేంద్రవరం గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేది. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఈ పుణ్యస్థలిలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది పుష్కరాలు ఘనంగా జరుగుతాయి. ఈ నగరం తూర్పుచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుడు పరిపాలించిన చారిత్రక స్థలం మరియు ఆ రాజ్యపు రాజధాని. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరి పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. రాజమహేంద్రిని రాజరాజ నరేంద్రుడు రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చరిత్రకారులు చెబుతారు. ఒక కథనం ప్రకారం 919-934 సంవత్సరాల మధ్య అమ్మరాజు విష్ణువర్ధన రాజు, ఆ తరువాత అమ్మరాజు విజయాదిత్యుడు పాలించారు. రాజమహేంద్రి వేంగి చాళుక్య పరిపాలనలో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత సంపాదించుకొంది. నరేంద్రుని పరిపాలనలో కవిత్రయంలో మెదటివారైన నన్నయ్య శ్రీ మహాభారతాన్ని రచించారు. తరువాత విజయాదిత్యుడు, కుళోత్తుంగ చోళుడు, రాజరాజవేంగి-2 రాజమహేంద్రిని పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్యంలో రాజమహేంద్రికి ప్రముఖస్థానం ఉంది. 1323లో ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లును ఆక్రమించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. ఇప్పటి రాజమహేంద్రవర నడిబోడ్డులో ఉన్న మసీదు తుగ్లక్ పరిపాలనాకాలంలో తూర్పుచాళుక్యులచే నిర్మించబడ్డ వేణుగోపాలస్వామివారి ఆలయ స్థానంలో నిర్మించబడింది. ఆ తరువాత రెడ్డి రాజులు తుగ్లక్ కు వ్యతిరేకంగా ఉద్యమించి గెలిచారు. ఆ తరువాత కపిలేశ్వర గజపతి, బహమనీ సుల్తానులు, పురుషోత్తమ గజపతి, శ్రీకృష్ణదేవరాయలు, ప్రతాపరుద్ర గజపతి వంటివారు రాజమహేంద్రిని పరిపాలించారు. రాజమండ్రి నగరం ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక పర్యాటక నగరం. ఇక్కడ రాజమండ్రి కేంద్ర కారాగారం, కాటన్ మ్యూజియం మరియు ఆనకట్ట, రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం, దత్త ముక్తి క్షేత్రం, ఆర్యభట్ట సైన్సు మ్యూజియం, స్వతంత్ర సమరయోదుల పార్క్, సైనికుల పార్క్, గౌతమీ గ్రంథాలయం వంటి చూడదగిన ప్రదేశాలు ఆలయాలు ఎన్నో వున్నాయి.

రాజమండ్రి నియోజకవర్గం 1952లో ఏర్పడింది. రాజకీయపరంగా చైతన్యానికి పెట్టింది పేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్న సంప్రదాయం కొనసాగుతుంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 3 లక్షల 77 వేలు. ఒకే సామాజికవర్గ ప్రాభల్యమంటూ కనిపించకపోయినా బీసీ వర్గానికి చెందిన తూర్పు కాపులు, వెలమ, దేవాంగ కులస్థుల ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా రాజమండ్రి సిటీని బీజేపీకి కేటాయించగా ఆకుల సత్యనారాయణ పోటీ చేసి గెలుపొందారు.

ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత ఉన్న రాజమండ్రి నగరంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. గోదావరి కాలుషాన్ని అరికట్టడం, రోడ్ల విస్తరణ, చారిత్రక పాత రైల్వే వంతెనను పర్యాటక ప్రదేశంగా మార్చటం వంటివి సమస్యలుగానే మిగిలిపోయాయి. గోదావరి చెంతనే ఉన్నా నగరవాసులకు తాగునీటి కష్టాలు తప్పటం లేదు. శివారు ప్రాంతాల్లోని వార్డులకు వేసవి వచ్చిందంటే తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కోక తప్పదు. రిజర్వాయర్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండటం, బ్రిటీషర్ల కాలంలో వేసిన పైపు లైన్లనే ఇప్పటికీ వాడుతున్నారు. తుప్పు పట్టి సగం నీరు మురుగు కాలువల పాలవుతోంది. వాటి రిపేర్ల కోసం రోడ్లను తవ్వేస్తున్నారు. కలుషితమైన నీటిని తాగి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. మరో వైపు నగరంలో ముంపు సమస్య ప్రధానంగా వేధిస్తొంది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే రోడ్లు చెరువులవుతున్నాయి. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పాలకులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.  ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా నగరానికి దాదాపు 9 వేల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. స్థల సేకరణ జరగకపోవటం ఇళ్ల నిర్మాణానికి అవాంతరంగా మారాయి. సుమరు 17 వేల మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా హౌసింగ్ ప్రాజెక్టులు ఎప్పటికి కార్యరూపం దాల్చుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

Top