ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ప్రత్తిపాడు నియోజకవర్గం

 

ప్రత్తిపాడు నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇక్కడ మొత్తం ఓటర్లు లక్షా 96 వేల మంది. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, సోమ్మవరం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా బీసీలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి వరపుల సుబ్బారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీలో చేరారు. ఇంతకు ముందు ఈ నియోజకవర్గం నుంచి పర్వత శ్రీ సత్యనారాయణ మూర్తి, పర్వత బాపనమ్మ, పర్వత సుబ్బారావు, ముద్రగడ పద్మనాభం, మకినేని పెద రత్తయ్య, ఎం వీరరాఘవ రావులు ప్రాతినిథ్యం వహించారు.

ఈ ప్రాంతంలోని ప్రజలకు కనీస వసతులు లేక సతమతమవుతున్నారు. చాలా గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్లు పాడైపోయి వాహనాల రాకపోకలకు అనుకూలంగా లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గతుకులమయంగా మారిన రోడ్లపై వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఏలేశ్వరం మండలానికి డిగ్రీ కాలేజీని మంజూరు చేశారు. కాని ఇంకా భవనాన్ని నిర్మించకపోవడంతో జూనియర్ కాలేజీ భవనం లోనే తరగతులు జరుగుతున్నాయి.  వీలైనంత త్వరగా భవనాలు నిర్మించాలని విద్యార్తులు కోరుతున్నారు. సుబ్బారెడ్డి ప్రాజెక్టు పూర్తయినా కాలువలు పూర్తిస్థాయిలో తవ్వకపోవడంతో ఆయకట్టుకు నీరు అండటం లేదు. దీంతోపాటు మరో మూడు ప్రాజెక్టులు ఉన్నా రైతులకు అవి ఉపయోగపడటం లేదు. ఏలూరు రిజర్వాయర్ ఆధునీకీకరణ జరగలేదు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నా దాని గురించి ఆలోచించేవారే లేరు.

సాగునీటి తరువాత మరో ముఖ్యమైన సమస్య మైనింగ్. ఈ ప్రాంతంలో లేట్రైట్ ఖనిజం ఎక్కువగా లభిస్తుండటంతో తవ్వకాలు విచ్చలవిడిగా జరుపుతున్నారు. కొద్ది మొత్తానికి అనుమతులు తీసుకుని వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. రోజుకు దాదాపు 500 ట్రిప్పులు జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం వందలాదిగా మట్టిలోడుతో భారీ వాహనాలు తిరుగుతుండటంతో రోడ్లు దెబ్బతిని పనికిరాని విధంగా తయారయ్యాయి. ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోడ్డు కోసం ఎన్ని అర్జీలు పెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మైనింగ్, మట్టి తరలింపుతో పరిసర గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామాల్లో ప్రజలు కోరుతున్నారు.

Top