ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తాగు నీళ్లు, స్కూలు, ఆసుపత్రి సదుపాయాలూ అరకు లోయ గిరిజనుల ప్రాధమిక హక్కు కాదా?

ఆంధ్రా ఊటీ గా ప్రసిద్ధి పొందిన అరకులోయ విశాఖ నగరానికి 111 కిలోమీటర్ల దూరంలో తూర్పుకనుమల్లో నెలకొనివుంది. అనంతగిరి కొండలు, సుంకరి రిజర్వు ఫారెస్ట్, ఇంకా సముద్రమట్టానికి 5000 అడుగుల ఎత్తులో గల గాలికొండలతో ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. అత్యంత అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులతో కూడిన అరకులోయకు బాక్సయిట్ తవ్వకాలతో హాని పొంచివుంది. 56,674. మంది జనాభాగల అరకు లోయలో 51శాతం మహిళలు , 49శాతం పురుషులు ఉన్నారు. వీరిలో 88 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తుంటే, కేవలం 12 శాతం మాత్రమే పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు. అందులో 52 శాతం మందికి మాత్రమే ఉద్యోగావకాశాలున్నాయి.

ప్రసిద్ద పర్యాటక ప్రాంతంలో పర్యాటకులకు ఆధునిక హంగులతో కూడిన, అందమైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, స్థానిక ప్రజలకు పర్యాటకం, ఖనిజాల అమ్మకం వల్ల వచ్చే ఆదాయంలో ఏ మాత్రం భాగస్వామ్యం లేక, కనీస వసతులైన రహదారులు, మంచినీరు, వైద్యం వంటి వాటికి దూరంగా బతుకుతున్నారు. 6 కిలోమీటర్ల విస్తీర్ణంతో, సముద్రమట్టానికి 1300 అడుగుల ఎత్తులో గల అరకు లోయలో జూన్- ఆక్టోబర్ నెలల మధ్య సుమారు 1700 మిల్లి మీటర్ల వర్షం కురుస్తుంది. కానీ ఈ నీటిని ఒడిసిపట్టి, కాపాడే చెక్ డ్యాంలు కానీ, రిజర్వాయర్లు కానీ లేవు. ఫలితంగా, తగినంత వర్షపాతం ఉన్నా ఈ ప్రాంత వాసులకు తాగునీరు లేదు.

మారుమూల ప్రాంతాలలో విసిరేసినట్లుగా అక్కడొక్కటి, ఇక్కడొక్కటి అన్నట్లుగా ఉండే వీరి జనావాసాలు 10 సంవత్సరాలకు ముందు దేశ జనాభా లెక్కల్లో కూడా నమోదుకాలేదు. కొండలు, లోయలతో కూడిన ఈ ప్రాంతాలను చేరడానికి రహదారులు లేవు. అరణ్య ప్రాంతాలవడం వల్ల నేరుగా వాహనాలతో వీరిని చేరుకోవడం కష్టమే.. స్వచ్చంద సంస్థల అవిరామ కృషి ఫలితంగా ఈ గిరిజన తెగల గురించి బాహ్య ప్రపంచానికి సమాచారం తెలిసింది. ముఖ్యంగా మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ప్రాంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం వెళ్ళడానికి కూడా భయపడేవారు. క్రమంగా ఈ ప్రజలు జనజీవన స్రవంతిలో కలిసినప్పటికీ, వారి జీవన ప్రమాణాలు పెరగలేదు. నిరక్షరాస్యత, మూఢనమ్మకాలతో బాటు, అందుబాటులో లేని ఆధునిక విద్య, వైద్యం వీరిని ఇంకా అంధకారంలోనే ఉంచింది. బుగత, వాల్మీకి, కొండదొర గిరిజనజాతులకు చెందిన తెగలు ఈ ప్రాంతంలో వరి, చోడి , సామ వంటి పంటలు పండిస్తున్నారు. పోడు వ్యవసాయ పద్ధతులననుసరించే గిరిజనులకు ఆధునిక పద్ధతులు తెలియవు. పురాతన పద్ధతులు అన్నిరకాల ప్రకృతి విపత్తులకు గురవుతుంది కాబట్టి వీరికి పంటదిగుబడి వల్ల వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. అడవులలో దొరికే మూలికలు, తేనే, జీడిపప్పు, సారపప్పు, శీకాయ వంటి ఉత్పత్తులను ఆధునిక సమాజం వాడుతుంది కానీ, శ్రమకోర్చి సేకరించిన గిరిపుత్రులకు తగిన ధర చెల్లించడంలో మాత్రం వెనుకడుగు వేస్తుంది. అప్రోచ్ రోడ్లు కూడా లేని ఈ ప్రాంతాలనుండి కాలినడకనే ప్రయాణం చేస్తారు గిరిజనులు. తగినన్ని పాఠశాలలు లేవు. ఉన్న వాటికి కుడా టీచర్లు, మౌలికవసతులు లేకపోవడంతో ఈ ప్రాంతపు పిల్లలను చదువువైపు ప్రోత్సహించడం అంత సులభం కాదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులకనుగుణంగా, వీరి పిల్లలు చిన్న వయస్సులోనే ఇంటి పనులు, పొలం పనులు చేయడంతో బాటు, సేకరించిన వస్తువులను సంతలో అమ్మడానికి కుడా తన కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. తగినన్ని వైద్య సదుపాయాలూ లేని ఏజెన్సీ ప్రాంతాలు వర్షాకాలం వస్తే మలేరియా వంటి అంటువ్యాధులతో వణుకుతుంది. గర్భిణీ స్త్రీలు సదుపాయాలూ లేక తమ గుడిసెలలోనే ప్రసవించడం వల్ల ఈ ప్రాంతంలో మాతాశిశు మరణాలు కూడా ఎక్కువే. స్వచ్చంద సంస్థల సహకారంతో ఇప్పుడిప్పుడు గిరిజన మహిళలు ఆసుపత్రికి రావడానికి ఇష్టపడుతున్నారు. కానీ, అత్యవసర సమయాలలో ఆసుపత్రికి వీరిని తీసుకుపోవడం కూడా సాహసమే. అరకు లోయ ఉన్న దుంబ్రిగూడ , హుకుంపేట, పెదబయలు , ముంచింగ్ పుట్టి , తండాలు విద్యుత్ , మంచినీరు , రోడ్లు, బస్సులు, పాఠశాలలు, ఆసుపత్రులు, వాటిలో పనిచేసేందుకు తగిన టీచర్లు, నర్సులు, ప్రాధమిక వైద్యం అందించగల ఆరోగ్య సిబ్బంది, త్రాగు, సాగు నీరు కొరకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. వీరందరిని ఓట్లు వేసే యంత్రాలుగానే చూడకుండా, మానవతా దృక్పధంతో స్పందించాల్సి ఉంది. గిరిజనుల అమాయకత్వాన్ని అటు పోలీసులు. ఇటు మావోయిస్టులు , ప్రజా ప్రతినిధులు వాడుకుని వారిని హింసించడమే కానీ వారికి మంచిచేసే ప్రయత్నాలు అరుదుగా జరుగుతాయి.

ప్రధాన ఆర్థిక వనరైన పర్యాటకాన్ని బలోపేతం చేయడానికి కొన్ని అత్యవసరమైన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మౌలిక వసతులయిన రహదారులు, తాగునీరు సమకూర్చడం వలన పర్యాటకుల సంఖ్య పెరిగి, అనేక అనుబంధ సంస్థలు, వాటి సేవల వలన స్థానిక యవతకు ఉఫాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలైన పద్మావతీ గార్డెన్, మ్యూ జియం లను ఆధునీకరించాలి. ఇప్పటికే స్థానికంగా ఉన్న వనరులైన హార్టికల్చర్, లక్కబొమ్మల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించి, వాటి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి. పర్యాటకకులను ఆకర్షించగల రణజిల్లేడు జలపాతాన్ని అభివృద్ధి చేయాలి. ఏజెన్సీ ప్రాంతం లో రహదారులు చాలా కీలకమైనవి. ఇవి ప్రజల ఆరోగ్య రక్షణతోబాటు, విద్య, ఉపాధి అవకాశాలను పెంపొందిస్తాయి. మంచినీటి సమస్యను తీర్చడానికి మూలపడిన నీటివనరులు పునరుద్దరించడంతో బాటు, చాలాకాలంగా వాయిదాపడ్డ చెక్ డ్యాంలు, రిజర్వాయర్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలి. ఉదాహరణకు, ఆడ్డమంద మినీ రిజర్వాయర్ మరియు జూలాపుట్ రిజర్వాయర్లకు మరమ్మత్తులు చేస్తే, దుంబ్రిగుడ , హుకుంపేట ప్రాంతాలకు తాగునీరు ఇవ్వచ్చు. మాచ్ ఖండ్ విద్యుత్ కేంద్రం నుండు విడుదలయ్యే నీళ్లు బలిమెల, సీలేరు మీదుగా, గోదావరిలో కలుస్తుంది. మత్స్యగెడ్డ ను ఆధునీకరిస్తే ముంచింగ్ పుట్టి లోని 9 గ్రామాలకు సాగు, త్రాగు నీరు అందించవచ్చు. గిరిజనుల ఉత్పత్తులను అమ్మడానికి అనువైన వేదిక కావాలి. ఈ ప్రాంతపు పిల్లల ఉన్నత విద్యాభివృద్ధికి తగినన్ని డిగ్రీ మరియు వృత్తి విద్యా కళాశాలలు ఏర్పరచాలి. విద్యా, వైద్య వ్యవస్థలను గాడిలో పెట్టి, నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. అప్పుడే గిరిజనులు పోలీసులు, మావోయిస్టులు, రాజకీయ నాయకులు ఇంకా వడ్డీ వ్యాపారుల దోపిడీ నుండి కాపాడగలం. సాధికార, స్వయం సంవృద్ధి అనే ఆయుధాలు మాత్రమే వీరిని అభివృద్ధి బాటలో నడిపించగలదు.

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి