కొత్తపేట నియోజకవర్గం కోనసీమకు ముఖద్వారంగా ఉంది. గోదావరి నది రాజమండ్రి దాటాక గౌతమి, వశిష్ట అనే పాయలుగా విడిపోతుంది. ఈ రెండు నదుల మధ్య కొత్తపేట నియోజకవర్గం ఉంటుంది. ఎటు చూసినా గోదావరి పరవళ్లే కనిపిస్తాయి. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం ఇక్కడ ఉంది. ఏడు వారాల నోములో భాగంగా ప్రతి శనివారం వాడపల్లి ఆలయానికి వేలాదిగా ప్రజలు తరలి వస్తుంటారు. శ్రీ మహా విష్ణువు మోహిని రూపంలో కొలువైన ర్యాలీ గ్రామంలోని శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం, శనీశ్వరుని పూజలకు దేశంలోనే ప్రసిద్ది చెందిన మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి ఆలయం, పలివెల శ్రీ ఉమా కొప్పేశ్వరస్వామి, చింతలూరు నూకాలమ్మ తల్లి ఆలయం వంటి ప్రసిద్ద పున్యక్షేత్రాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
ధవళేశ్వరంలోని సర్ అర్దర్ కాటన్ బ్యారేజీ నుంచి ప్రవహించే ప్రధాన కాలువ కారణంగా కొత్తపేట నియోజకవర్గంలో వ్యవసాయం బాగా అభివృద్ది చెందింది. నియోజకవర్గంలోని ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. ముఖ్యంగా ఇక్కడి రైతులు వరితోపాటు అరటి, కంద, పసుపు వంటి వాణిజ్య పంటలు సాగు చేస్తుంటారు. ఆలమూరు మండలంలోని గోదావరి లంకల్లో పెద్దయెత్తున కూరగాయలు పండిస్తారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం గ్రామంలో తయారు చేసే పూతరేకులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మట్టికుండలపై బియ్యపు పిండితో పూత చుట్టల్లా చేసి వాటి ద్వారా స్వీటు తయారు చేస్తారు. అంతేకాకుండా ఆత్రేయపురం సమీపంలోని గ్రామాల్లో తయారు చేసే పచ్చళ్లు సైతం ఆదరణ పొందినవి. ఇక్కడి కుటీర పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వివిధ రకాల పచ్చళ్లును ఇతర రాష్ట్రాలకు పెద్దయెత్తున ఎగుమతి చేస్తుంటారు. నియోజకవర్గం కేంద్రం కొత్తపేట అయినప్పటికీ 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న రావులపాలెం ప్రధాన వాణిజ్య కేంద్రంగా కొనసాగుతుంది.
నియోజకవర్గంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు సుమారుగా 225700 మంది. సామాజికపరంగా చూస్తే కాపులు, ఇంచుమించు అదే సంఖ్యలో శెట్టి బలిజ, ఇతర బీసీలు, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, క్షత్రియ ఇతర వర్గాలవారు ఉంటారు. 2014 ఎన్నికల్లో చీర్ల జగ్గిరెడ్డి వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణపై విజయం సాధించారు.
1952 నుంచి రాజోలు నియోజకవర్గంలో భాగంగా ఉన్న కొత్తపేట తాలూకా 1967లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఆలమూరు మండలం ఈ నియోజకవర్గంలో కలిసింది.
కొత్తపేట నియోజకవర్గం పైకి ఎలా కనిపిస్తున్నా నియోజకవర్గంలో అనేక సమస్యలు దర్శనమిస్తాయి. చాలా గ్రామాల్లో భుగర్భ జలాలు తాగేందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో నియోజకవర్గం చుట్టూ ప్రవహిస్తున్న గోదావరి నీటిని సరఫరా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. పదేళ్ల క్రితం బొబ్బరిలంక వద్ద ప్రారంభించిన గోదావరి జలాల సరఫరా ప్రాజెక్టు మొదటి దశను కూడా దాటకపోవడంతో. 50కి పైగా గ్రామాలకు దశలవారీగా రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యం కలగానే మిగిలిపోయింది. మరోవైపు ఎక్కువమంది రైతులున్న ఈ నియోజకవర్గంలో వేల యెకరాల్లో సాగు చేస్తున్న అరటి పంటకు మద్దతు ధర లభించడం లేదు. రావులపాలెంలో అంతర్రాష్ట్ర మార్కెట్ ఉన్నప్పటికి రైతులకు మద్దతు ధర దక్కకపోవటంతో ఏటా రైతులు నష్టాలపాలవుతున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో ప్రధానమైంది పేదలకు ఇళ్ల స్థలాల సమస్య. గతంలో సుమారు వంద కోట్ల రూపాయల ప్రైవేటు భూమిని సేకరించినా ఇప్పటి వరకు ఒక్క ఇంటి పట్టా పంపిణీ జరగలేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో పెద్ద యెత్తున సిమెంట్ రోడ్లు వేస్తున్నప్పటికీ ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వాహ్నంగా ఉంది. రావులపాలెం, కొత్తపేట, జొన్నాడ, మండపేట ప్రధాన రహదారుల అభివృద్ది జరగక నిత్యం అనేకమంది గాయాలపాలవుతున్నారు. దశాబ్దాల క్రితం వేసిన ఈతకోట, పలివెల రోడ్డు దుస్థితి అలాగే కొనసాగుతుంది. వరద ముప్పు నుంచి రక్షించే విధంగా చేపట్టిన గోదావరి యేటి గట్ల పటిష్టత పనుల్లో జాప్యం జరుగుతుంది.