ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

జల, శబ్ద వాయు కాలుష్యాలనుండి విశాఖ దక్షిణ ప్రాంతానికి విరుగుడు ప్రజాచైతన్యం తోనే సాధ్యం

విశాఖపట్నం దక్షిణ భాగంలో దుకాణాలు, షాపింగ్ మాల్స్ తో కూడుకున్న అత్యంత రద్దీ ప్రదేశంగా పేర్కొనవచ్చు. డాబాగార్డెన్స్, పాత పోస్ట్ ఆఫీస్ ఏరియా, జగదాంబా జంక్షన్, అల్లిపురం, ద్వారకానగర్, జ్ఞానాపురం మొదలయిన ప్రదేశాలు దక్షిణ విశాఖలో ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. విశాఖ నగరం శరవేగంతో వృద్ధి చెందుతోంది. కానీ, ఈ అభివృద్ధంతా నగరపు ఉత్తరం వైపే కేంద్రీకృతమై ఉంది. ఫలితంగా, దక్షిణ భాగమంతా పాత పట్నంగానే మిగిలిపోయింది. ఇరుకైన రోడ్లు, రోడ్లమీదనే ప్రవహించే మురుగు కాలువలు, పేరుకుపోయిన చెత్త, దుర్వాసన, మురికికాలువలపై తేలే వ్యర్ధాలు, దోమలు అనునిత్యం ఈ ప్రాంతంలో నివసించే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందనవచ్చు. పారిశుద్యం దక్షిణ విశాఖపట్టణానికి అతిపెద్ద సమస్యగా చెప్పవచ్చు. దుర్గంధపు మురుగు రోడ్లపైనే ప్రవహిస్తుంటే ఎలుకలు, కుక్కలు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఈ ప్రాంతవాసుల మొర వినేవారు ఎవ్వరూలేరు అని స్థానికులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎందుకంటె, దీనికంటే ప్రాణాంతకమైన సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి మరి.

విశాఖ దక్షిణ బాగాన నౌకాశ్రయం, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, ఇంకా విశాఖ ఉక్కు కర్మాగారం వంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్రీకరించి ఉండటం వలన ఈ ప్రాంతంలో శబ్ద, వాయు మరియు జల కాలుష్యంతో నిండిపోయింది. ముఖ్యంగా పెట్రోలియం, ఉక్కు కర్మాగారాల నుండి వెలువడే సన్నని మంటలు గాలిలో అతిసూక్ష్మమైన ధూళి కణాలను వెదజల్లడం వలన ఈ ప్రాంతమంతా తెల్లని మంచువంటి దుమ్ము పొరతో కప్పివేయబడి, ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు సంక్రమించేలా చేస్తుంది. విశాఖ పోర్ట్ ట్రస్ట్ కార్గో విభాగంలో సల్ఫర్, బొగ్గు వంటి ఖనిజాల లోడింగ్ లేదా అన్ లోడింగ్ వల్ల ఆ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పసిపిల్లల్లో శ్వాస మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు కలుగజేస్తున్నాయి. దశాబ్దాలుగా స్థిరపడ్డ స్థానికులను అక్కడనుండి కాళీ చేయించలేం. అంతమందికి పునరావాసం అంటే ప్రభుత్వాలపై పెనుభారం పడుతుంది కాబట్టి, కేంద్ర రంగ సంస్థలు పర్యావరణ హితమైన పరిశ్రమల పాలసీని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలు, ముఖ్యంగా స్వచ్చంద సంస్థలు, ఈ సంస్థలతో కలిసి పనిచేసి, స్థానికులకు ఉపశమనం కలిగే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు తలుచుకుంటే సాధ్యం కానిది ఉండదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వంతో కలిసి కాలుష్యనివారణ చర్యలు చేపట్టాలి. సముద్రం ఒడ్డునే ఉన్న పలు ప్రవేటు సంస్థలు ఫార్మా, ఆక్వా సంస్థలు పరిశ్రమల కాలుష్యాలను నేరుగా సముద్రంలోనే విడుదల చేస్తున్నాయి. ఈ చర్య సముద్ర జలాలనే కాకుండా, అందులో నివసించే చేపలు ఇతర జలచరాలను కూడా విషమయం చేస్తున్నాయి. ఇక్కడి సముద్ర సంబంధిత ఆహారం తీసుకోవడం వలన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.

మున్సిపల్ విధులను నిర్వర్తించాల్సిన నగరపాలక సంస్థ రహదారుల శుభ్రత, పారిశుద్ధ్యం పనులు సక్రమంగా నిర్వర్తించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హానికారక కాలుష్య నివారణకు సత్వర చర్యలు చేపట్టాలి. కాలుష్యం వలన ప్రజలకు కలిగే నష్టాన్ని డబ్బుతో లేదా పరిహారాలతో పూడ్చలేం. నివారణే తరుణోపాయం. చైతన్యానికి మించిన విరుగుడులేడు. అక్షరాస్యత అధికంగా ఉన్న ప్రజలలో చైతన్యం తెస్తే వారు ప్రశ్నించి పనులు చేయడం లేదా చేయించుకోవడమో చేస్తారు.

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి