ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పెందుర్తి స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ఇంకెంతకాలం ప్రేక్షకపాత్ర వహిస్తారు?

విశాఖ మహానగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 'పెందుర్తి నియోజక వర్గం' , విశాఖ మహానగరానికి పశ్చిమ దిశలో, వాణిజ్య కేంద్రాలతో కూడిన అతిపెద్ద జనావాసం. 15 పంచాయతీల సమాహారమైన ఈ నియోజకవర్గం లో 2011 జనగణన ప్రకారం 242989 మంది నివసిస్తున్నారు. వీరిలో 60.78% గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తుండగా, 39.22% మంది పట్టణాలలో నివసిస్తున్నారు. జిల్లా కేంద్రమైన విశాఖ నగరానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంటూ, సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో ఉంది పెందుర్తి. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన పెందుర్తీ మండలం జనాభా 106,513. వీరిలో 53,800 మంది మగవారు కాగా, 52,713. మంది మహిళలున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పెందుర్తి మండల అక్షరాస్యత 79 శాతం. 86% మగవారు, 72 శాతం మహిళలు అక్షరాస్యులుగా ఉన్న ఈ మండలంలో 2001 నుండి 2011 మధ్యకాలం లో మగవారి అక్షరాస్యత 4% పెరిగితే, మహిళల అక్షరాస్యత 10% పెరిగింది.

అక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఈ నియోజక వర్గం యువత ఉన్నతవిద్యనభ్యసించడానికి తగిన ప్రభుత్వ కళశాలలు, వృత్తి కళాశాలలు అవసరం. కానీ, మంజూరైన కళాశాలలు కూడా కార్యరూపం దాల్చదానికి దశాబ్దాలు పడుతుందంటే ఎవరిని ప్రశ్నించాలి? ఉదాహరణకు, ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలన్నది దశాబ్దాలుగా ఉన్న డిమాండ్. దీనికై మంజూరయిన నిధులు వృధాగా మూలుగుతున్నా కళాశాల మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. అలాగే, ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల మంజూరై ఏళ్లు గడుస్తున్నా అది అమలుకు నోచుకోకపోవడంతో అందుబాటుకు రాలేదు. యువత విద్యా, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే ఈ అంశాలు ఎందుకు సాకారం కావో స్థానిక ప్రజాప్రతినిధులే చెప్పాలి . నిరుద్యోగం, ఆకలి, పేదరికం వంటివి ఈ ప్రాంతపు యువతను పెడమార్గంలోకి మళ్లించకుండా ఉండాలంటే వీరికి తగిన విద్యా, ఉఫాధి, ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత సమాజానిది, అది ఎన్నుకున్న ప్రతినిదులది.

శరవేగంతో పెరుగుతున్న పెందుర్తి పట్టణాభివృద్ధికి పలు ఆటంకాలు అవరోధంగా నిలుస్తున్నాయి. పట్టణంగా ఎదుగుతున్న క్రమంలో ఇక్కడి వ్యవసాయభూములు ఇండ్లుగా, పరిశ్రమలకు నిలయంగా మారడంలో ఆశ్చర్యం లేదు. కానీ, పరిశ్రమల స్థాపనలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే, కాలుష్యం అతిపెద్ద భారంగా పరిణమిస్తుందనడానికి పరవాడ ఫార్మాసిటీనే ఒక గొప్ప ఉదాహరణ. ప్రత్యేక ఆర్థిక మండలిగా ఏర్పడిన పార్మాసిటీ ఇప్పుడు నగరం నడిబొడ్డులో ఉంది ఇక్కడి గాలి, భూగర్భ జలాలను పార్మాకంపెనీలు కలుషితం చేస్తున్నాయి. కాలుష్యం బారిన పడిన తాడి గ్రామాన్ని ఇక్కడనుండి వెంటనే తరలించి, పునరావాసం కల్పించాలి.

సింహాచలం దేవస్థానానికి విజయనగర సంస్థానం నుండి సంక్రమించిన 14, 000 ఎకరాల భూమి పంచ గ్రామాలుగా ప్రసిద్ధి పొందిన అడవివరం, వేపగుంట, వెంకటాపురం, చీమలపల్లి, పురుషోత్తమపురం గ్రామాలలో ఉన్నాయి. దేవస్థానం నుండి కౌలు భూములుగా తరాలుగా సాగు చేసిన రైతులు ఆ గ్రామాలు పట్టణీకరణకు గురౌతుండడంతో రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేశారు. ఈ భూమిని నివాస భూములుగా మార్చి ఆయా సంస్థలు పలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు అమ్మేశాయి. దేవస్థానం భూములను అమ్మే హక్కు రైతులకు లేనందున దేవాదాయశాఖ దీనికి అభ్యంతరం తెలుపుతూ, ఈ భూములు స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో భూములు కొన్న పలు బీద, అల్ఫాఆదాయ, మధ్య తరగతి కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. గత 15 సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. అడవివరం మినహా, మిగతా నాలుగు గ్రామాలు పెందుర్తిలోనే ఉన్నాయి. 5000 ఎకరాల భూమిని ప్రభుత్వం క్రమబద్దీకరించినా, మరో 11, 000 ఎకరాల భూ వివాదం అపరిష్కృతంగా ఉంది. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

చిన్న, పెద్ద వ్యాధులన్నిటికి పెందుర్తి ప్రజలు విశాక కెజిహేచ్ ఆసుపత్రికి రావల్సిందే. పెందుర్తి లో గల ప్రజారోగ్య కేంద్రాన్ని 30 పడకలుగల ఆసుపత్రిగా ప్రకటించినా ఇంకా అక్కడ మౌలికవసతులు కల్పించని కారణంగా గత 10 ఏళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగా నే మిగిలిపోయింది. ప్రవేటు భాగస్వామ్యంలో ని కార్పొరేట్ వైద్యశాలలు ఇదే అదనుగా, తీసుకుని ప్రజలపై అధిక వైద్యసేవల భారాన్ని మోపుతున్నాయి. ఆరోగ్యవంతులైన ప్రజలు అధిక ఉత్త్పత్తితో బాటు,ఆర్థికాభివృద్ధి లొ కీలకపాత్ర పోషిస్తారనడం లో సందేహం లేదు. పాలక వర్గాలు స్పందించకుంటే, ప్రజాసంఘాలు, సోషియల్ మీడియా, పత్రికలూ, టీవీ లు తగిన ఒత్తిడిచేసి వీటిని సాధించాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థ ప్రతినిధులు దీనిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే, ఈ సమస్యలు వెంటనే పరిష్కారమౌతాయనడం లో సందేహం లేదు.

పెందుర్తి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి