ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

అమలాపురం నియోజకవర్గం

గోదావరి నదీ జలాల మధ్య ఏర్పడిన సుందర కోనసీమ ప్రాంతంలో ముఖ్యమైన ప్రదేశం ఈ అమలాపురం. ఎటు చూసినా పచ్చదనమే. కొబ్బరి చెట్లు, వరి పొలాలు, గోదావరి పరవళ్లతో ప్రకృతి అందాలు నిత్యం కనువిందు చేస్తుంటాయి. కోనసీమలోని పది మండలాలకు అమలాపురం ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉంది. ఆయిల్, గ్యాస్ వెలికితీత కోసం ఓఎంజీసీ కార్యకలాపాలు జరుగుతుంటాయి. పట్టణంలో ఉన్న క్లాక్ టవర్ స్వాతంత్ర్యానికి పూర్వమే నిర్మించారు. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉండాగా దీని స్థానంలో మరో క్లాక్ టవర్ ను నిర్మిస్తున్నారు. చల్లపల్లి ప్రధాన కాలువపై రెందు చోట్ల ఉండే ప్రధాన రహదారులకు ఎర్ర వంతెన, నల్ల వంతెన అని పిలుస్తారు. అమలాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని పార్లమెంటు భవనాన్ని నమూనాగా తీసుకుని నిర్మించారు. ప్రతి సంవత్సరం దసరా రోజు ఇక్కడి స్థానికులు చేసే యుద్ద విద్యల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. కిమ్స్ మెడికల్ కాలేజి, శ్రీ కోనసీమ భనోజీ రామర్స్ కళాశాల వంటి పేరుగాంచిన కళాశాలలు ఉన్నాయి. అమలాపురంలో ఉన్న అమలేశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల వల్ల ఈ ఊరు పంచలింగాపురంగా కూడా పిలవబడేది. ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు కళా వెంకట్రావు, జీఎంసీ బాలయోగి (లోక్ సభ మాజీ స్పీకర్), బీఎస్ మూర్తి (కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి), పలచోళ్ళ వెంకట రంగయ్య నాయుడు (కోనసీమ మొదటి ఈఫ్శ్), గొలకోటి నరశింహ మూర్తి, పుత్సా కృష్ణ కామేశ్వర్, సీవీ సర్వేశ్వరశర్మ, ద్వానాశాస్త్రి, పైడిపాల, మార్గశీర్ష, వాడవల్లి చక్రపాణిరావు, దార్ల వెంకటేశ్వరరావు, బొజ్జాతారకం, కుసుమ కృష్ణమూర్తి, మోకా విష్ణు వరప్రసాదరావు, కోరాడ రామకృష్ణయ్య వంటి ప్రముఖులు ఈ నియోజకవర్గానికి చెందినవారే.

ఈ నియోజకవర్గాన్ని 1952లో ఏర్పాటు చేశారు. ఒక మున్సిపాలిటి, 60 గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అమలాపురం శాసనసభతోపాటు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం. ఈ నియోజకవర్గంలో అమలాపురం మున్సిపాలిటీతోపాటు అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 185392 మంది. నియోజకవర్గంలో కాపు, శెట్టి బలిజ, ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలవారు ఉండగా కాపు సామాజికవర్గ ఆధిక్యత కన్పిస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దివంగత జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశాడు. మెట్ల సత్యనారాయణ మంత్రిగా పనిచేశారు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం(ఎస్సీ), రాజోలు(ఎస్సీ), గన్నవరం(ఎస్సీ), కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో అమలాపురం ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఐతబత్తుల ఆనందరావు వైసీపీ అభ్యర్థి విశ్వరూప్ పై పోటీ చేసి గెలిచారు.

మున్సిపాలిటీతోపాటు చుట్టుపక్కల పది మండలాలకు వ్యాపార, వాణిజ్య కేంద్రం కావడంతో అనేకమంది ప్రజలు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. పట్టణంలోని రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న బైపాస్ రహదారికి తోడు మరికొన్ని రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. రూరల్ ప్రాంతాల్లో మంచినీటీ సమస్య ఉంది. వాటర్ ట్యాంకులు లేకపోవడంతో వేసవిలో మంచి నీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ చేపల చెరువుల వల్ల జల కాలుష్యం పెరుగుతుందని, దీన్ని అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Top