ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గడచిన 70 సంవత్సరాలుగా ప్రాధమిక వసతుల కొరకే ఎదురుచూస్తున్న మాడుగుల నియోజకవర్గం ప్రజల జీవితాలలో మార్పు సాధ్యమేనా?

జిల్లా కేంద్రం విశాఖ నగరానికి పశ్చిమాన 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాడుగుల పట్టణం మండల కేంద్రంగానూ, జిల్లాలోని 15 శాసనసభా నియోజకవర్గాల్లో ఒకటిగాను ప్రసిద్ధి పొందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మాడుగుల పట్టణంలో 12704 మంది ఉండగా వారిలో 51 శాతం మహిళలు, 49 శాతం మగవారు ఉన్నారు. మొత్తం పట్ట్టణ జనాభాలో 58.9%అక్షరాస్యులుండగా, వారిలో మహిళల అక్షరాస్యత కేవలం 27.2%. మాత్రమే . మాడుగుల మండలం జనాభా72,006 మంది కాగా, వారిలో 36,814 మంది వృత్తి, వ్యాపార అవకాశాలు పొందగలిగారు. దాదాపు 57 శాతం మంది మగవారు ఉద్యోగ, వ్యాపారావకాశాలు పొందితే, 43 శాతం మంది మహిళలు ఆర్ధిక స్వయం నిర్ణయాధికారాన్ని కలిగివున్నారు. పేరుకు మాత్రమే మాడుగుల పట్టణంగా పిలుస్తున్నప్పటికీ, నూటికి నూరుశాతం జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారు. మాడుగుల, చీడికాడ, దేవరాపల్లె, ఇంకా, కే. కోటపాడు మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగే ఈ నియోజకవర్గ పరిధిలో 25% మంది మాత్రమే రైతులుకాగా, మిగతా 75% మంది రైతుకూలీలు. కాబట్టి, జనాభాలో అధిక శాతం ప్రజలకు స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం లేదు. మొత్తం మండల జనాభా 70 వేల సంఖ్యకు చేరినా, ఈ జనాభాకు సరిపడినన్ని విద్యావకాశాలు లేవు. వీరి విద్యావసరాలు తీర్చడానికి 140 ప్రాధమిక పాఠశాలలు,80 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 36 హైస్కూల్స్, 4 జూనియర్ కళాశాలలు, కేవలం ఒక సైన్స్ కళాశాల ఇంకా 2 ఆర్ట్స్ కళాశాలలు ఉన్నాయి. వృత్తి విద్యా బోధనకై ఇక్కడ ఎటువంటి సంస్థలు లేవు. ప్రాధమిక విద్య ముగిసిన తరువాత విద్య ముందుకు సాగాలంటే ప్రభుత్వ హైస్కూళ్లు, మరియు జూనియర్ కళాశాలల సంఖ్య పెరగాల్సి ఉంది. విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాలలో దేశమంతా దూసుకుపోతుంటే, ఈ ప్రాంతం పిల్లలు వృత్తి లేదా, టెక్నికల్ ఏడ్యుకేషన్ కొరకు ఇతర ప్రాంతాలకు వలసపోవలసి వస్తున్నది. సైన్స్, టెక్నాలజీ రంగంలో కృషి చెయ్యని సమాజాలు ఆర్థికంగా వెనుకబడిపోతాయి. ఎక్కువగా రైతు కూలీలు ఉండే ఈ నియోజకవర్గ ప్రజల పిల్లల భవిష్యత్తు విద్యారంగ ప్రగతి మీదనే ఆధారపడి ఉంది. తమ తండ్రులు, తాత ల మాదిరి వీరు కూడా కూలీలుగా రైతు కూలీలుగా జీవనం సాగించలేరు కదా, వారి జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే, విద్యాశాఖాను సంస్కరించాల్సి ఉంటుంది.

ఇక రైతులు, వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు జీవనం సాగించాలంటే ఈ ప్రాంతంలో ఉన్న నీటి వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మాడుగుల పరిధిలో పెద్దేరు, ఎడమకాలువ, తాబేరు, ఉరకగెడ్డ, గొర్రిగెడ్డ, పనులు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, సుమారు 20 వేల ఎకరాలకు నీరందించవచ్చు. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న చీడికాడమండలంలో గల కోనాం రిజర్వాయర్ మరమ్మత్తులకు నోచుకోకుండా నిల్వ సామర్థ్యం తగ్గిపోతే, దేవరాపల్లి మండలంలో ఉన్న దేవాదా జలాశయానికి నీళ్లు అందాక రైతులకు ఉపయోగపడటం లేదు. మనదేశంలో 76 శాతం మంది రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా ఇతర పనుల వైపు మొగ్గు చూపుతున్నారని అనేక అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే, ఆహార సంక్షోబానికి మనమెంతో దూరంలో లేము.

ఇక ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు కూడా లేవు. జీడీ పిక్కల పరిశ్రమల వల్ల కార్మికులు చర్మ సంబంధిత వ్యాధులకు గురవడం తప్పితే ఇది పెద్ద ఆదాయ వనరుగా పరిగణించలేకపోతున్నారు.

ఈ నియోజకవర్గం పరిధిలో అనేక గ్రామాలకు, ముఖ్యంగా గిరిజన గ్రామాలకు రోడ్లు లేవు. తాగు నీరు, వైద్యం ఆరోగ్యం వంటివి గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా శూన్యం. ప్రాధమిక మౌలిక వసతులయిన రోడ్లు, బస్సు సౌకర్యం, కుళాయి వంటివి కల్పిస్తే, ఇక్కడ గ్రామాలలో పిల్లలు నీళ్లకోసం కాకుండా చదువుపై ద్రుష్టి సారిస్తారు. స్వాతంత్య్రం వచ్చి 7 దశకాలు గడిచినా మరుగుదోడ్లు, మంచినీళ్లు, రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలల కల్పనలో మనం విఫలమైతే, మన జిల్లాలు, గ్రామాలు వెనుకబడి, ఎటువంటి మార్పుకు నోచుకోకుండానే మరికొన్ని దశాబ్దాలు నెట్టాల్సిందేనా? మన జీవితాలను బాగుచేసుకునే బాధ్యత మనందరిది. మొదటి అడుగు వేయడానికి ఎవరో ఒకరు ముందుకురావాలని ఎదురుచూడకుండా స్థానిక ప్రజా ప్రతినిధులలో కదలిక తేవడానికి ఇంకా సందేహం ఎందుకు? ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్యం అనే మాటను పేపర్లకే పరిమితం చేయకుండా, గ్రామీణ సమాజంలో ఉన్న అన్ని వర్గాలవారిని నిధులు సమకూర్చి పనులు చేయడంలో భాగస్వాములను చేస్తే, మాడుగుల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది.

మాడుగుల నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి