13వ శతాబ్దం వరకు నెల్లూరును విక్రమ సింహపురిగా పిలిచేవారు. కాలక్రమంలో ఈ ప్రాంతం నెల్లూరుగా రూపాంతరం చెందింది. నెల్లి అంటే ఉసిరికాయ . ప్రాంతీయ ఇతిహాసం మేరకు పూర్వం నెల్లి చెట్టుకింద లింగాకారంలో వెలిసిన ఒక రాతి బొమ్మ కారణంగా ఈ ప్రాంతాన్ని నెల్లూరుగా పిలిచారు. స్వాతంత్ర్యానికి పూర్వము ఈ ప్రాంతాన్ని మౌర్యులు, చోళులు, పల్లవులు, కాకాతీయులు, పాండ్యులు, విజయనగర వంశస్థులు, నవాబులు, ఆంగ్లేయులు పాలించారు.. ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రెసిడెన్సీలో భాగమై ఉన్న రోజులలో నెల్లూరు కూడా తమిళనాడులో ఉండేది. 1956లో బాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఏర్పడిన తోలి భాషా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు భాగమైంది. నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర అవతరణకై 59రోజులు నిరాహార దీక్ష చేసి మరణించిన తరువాత ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది కాబట్టే తరువాతి కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ జిల్లా పేరును అధికారికంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసింది.
2011 జనాభా లెక్కల ప్రకారం నెల్లూరు జిల్లాలో 2,966,082 మంది ప్రజలు ఆవాసముంటున్నారు. వీరిలో 1,492,974 మంది మగవారు, 1,470,583 మంది మహిళలు ఉన్నారు. 30 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాలలో ఉండగా మిగతా 70 శాతం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. జిల్లా అక్షరాస్యత 69.%.
రాష్ట్ర స్థూల ఉత్త్పత్తిలో నెల్లూరు జిల్లా వాటా 30,482 కోట్ల రూపాయలను (2 బిలియన్ల). ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 5.8% . 2013-14 ఆర్ధిక సంవత్సరంలో ఈ జిల్లా సగటు తలసరి ఆదాయం 80,782 రూపాయలు. జిల్లా ఆర్డకాభివృద్ధిలో వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.. వరి , చెరకు, నిమ్మ, టమాటో, . పాలు, మాంసం, చేపలు ఇక్కడ ఎక్కువగా లభ్యమవుతున్నాయి. పరిశ్రమలు, గనులు, తయారీ రంగం, రియల్ ఎస్టేట్, విద్యారంగం మరియు రవాణా రంగాలు కూడా జిల్లా ఆర్థికాభివృద్ధిలో భాగమయ్యాయి.
పాలనా సౌలభ్యం కొరకు ఈ జిల్లాను 46 మండలాలుగా, 3 రెవిన్యూ డివిజన్లుగా విభజించారు. బారాషాహీద్ దర్గా, రొట్టెల పండుగ నెల్లూరు జిల్లా ప్రత్యేకతలు. లక్షలాదిగా ప్రజలు దర్గాలో దీవెనలందుకుంటే, ఏటా అక్టోబర్ నెల మొదటి మూడు రోజులలో ఈ దర్గా వద్ద రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ పండగలో ప్రజలు స్వయంగా తయారుచేసిన రొట్టెలను ఇతరులతో పంచుకుంటారు. దీనివలన వారి కోరికలు 100 శాతం నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
ప్రాచీనకాలంలో మహాభారతాన్ని తెలుగులోకి తర్జుమా చేసిన తిక్కన్న నుండి, ఆధునిక సినీరచయిత ఆరుద్ర, సినీగాయకుడు యస్. పి బాలసుబ్రమణ్యం వరకు ఎందరో గొప్ప వ్యక్తులు ఈజిల్లానుండి వచ్చిన వారే.
మత్స్యకార గ్రామాలకు మౌలిక వసతులు కల్పించి, జాలర్లకు తగిన ప్రోత్సాహకాలు అవసరం.
జిల్లాలో కనీసం 33 మండలాలలో నీటి ఎద్దడి, కరువు తాండవమాడుతున్నది. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టుబడి, రుణవసతి, పెరిజ్ఞానం రవాణా, స్టోరేజీ , వంటి సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పై సమస్యలపై స్పందించి, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే జిల్లా అన్ని విధాలా అభివృద్ధి కాగలదు.